శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 15 (నమస్తే శేరిలింగంపల్లి): దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ చేసుకోవడానికి చేతిలో భూమి లేకుండా, నివాస స్థలాలు, ఇండ్లు లేకుండా, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ లపై ఆధారపడి జీవించే విధంగా నాటి నుండి నేటి వరకు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన, పాలిస్తున్న పార్టీలే కారణం అని దీనికి భిన్నంగా యంసిపిఐ(యు) జెండా చేతపట్టుకొని తాండ్ర కుమార్ నాయకత్వంలో రక్తం చిందించి అనేక బస్తీలు ఏ అధికారం లేకుండా సాధించి పెట్టారని వీటి రక్షణకై ప్రజలంతా సంఘటితం అయి ప్రజా ఉద్యమాలు నిర్మాణమే ఏకైక మార్గం అని యంసిపిఐ(యు) జాతీయ కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్ పిలుపు నిచ్చారు.
మియాపూర్ టేక్ నర్సింహ నగర్ లో తాండ్ర కుమార్ 3వ వర్ధంతి సభను తుడుం అనిల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. మియాపూర్ చౌరస్తాలో ఉన్న తాండ్ర కుమార్ స్థూపానికి సిపిఐ యంయల్ ( న్యూ డెమోక్రసీ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జేవి చలపతిరావు, సిపిఐ యంయల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రదర్శనగా సబా స్థలానికి చేరుకున్నారు. టేక్ నర్సింహ నగర్ లో నిర్మాణం అయిన తాండ్ర కుమార్ విగ్రహంను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ ఓంకార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అశోక్ ఓంకార్ మాట్లాడుతూ భూమి కోసం, ఇంటి స్థలం కోసం, ఇండ్ల నిర్మాణం కోసం ప్రజా పోరాటాలకు ప్రజలు సన్నద్ధం కావాలన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా భూమి సమస్యను పరిష్కరించడానికి బదులు పేదవారి భూములను, ఇండ్ల స్థలాలను కార్పొరేట్ సంపన్న వర్గాలకు ఫార్మా కంపెనీల పేరుతో, రింగ్ రోడ్డు నిర్మాణం పేరుతో లక్షలాది ఎకరాల భూమిని ధారాదత్తం చేస్తున్నదని అన్నారు. దీనికి వ్యతిరేకంగా తాండ్ర కుమార్ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సభలో యంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సిపిఐ యంయల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జేవి చలపతిరావు, సిపిఎం రాష్ట్ర నాయకుడు డి జి నరసింహ రావు, సిపిఐ యం యల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ , ఎస్ యుసిఐ (సి) పార్టీ రాష్ట్ర కార్యదర్శి సి హెచ్ మురహరి, బిఎల్ఎఫ్ చైర్మన్ నల్ల సూర్యప్రకాష్, యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, గోనె కుమారస్వామి, వసుకుల మట్టయ్య, ఏ హంసా రెడ్డి, పెద్దార రమేష్ పాల్గొన్నారు.