మైనారిటీ హాలా.. మల్టీపర్పస్‌ హాలా? : బీఆర్‌ఎస్‌ నేత బొబ్బ నవతా రెడ్డి

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అది మైనారిటీ ఫంక్షన్ హాలా? లేక మల్టీపర్పస్ ఫంక్షన్ హాలా? ఎన్నికలప్పుడు ఒక మాట.. గెలిచాక మరో మాట మాట్లాడుతూ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే మైనారిటీలను ఘోరంగా మోసం చేస్తున్నార‌ని బీఆర్ఎస్ నేత‌, మాజీ కార్పొరేట‌ర్ బొబ్బ నవతా రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. బీ.ఆర్.ఎస్ నాయకుడు రాయల కార్తిక్ ఆధ్వర్యంలో సంగారెడ్డి, శ్రీకాంత్ యాదవ్, ఎం.డి అల్లావుద్దీన్ పటేల్ , పొట్ట నరేందర్ యాదవ్, ఎం.డి సలీం తో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్‌లోని ఖానామెట్‌లో కొన‌సాగుతున్న‌ ఫంక్షన్ హాల్ నిర్మాణ ప‌నుల‌ను న‌వ‌తా రెడ్డి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆమె ప‌నుల జాప్యంపై తీవ్రస్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఖానామెట్‌లో ఫంక్షన్ హాల్ నిర్మాణం ఓ ప్రహసనంగా మారింది. 2023 అక్టోబర్‌లో నిధులు మంజూరు కాకుండానే హడావుడిగా శిలాఫలకం వేశారు. అప్పట్లో అది ముస్లిం మైనారిటీ ఫంక్షన్ హాల్ అని ప్రచారం చేశారు. కానీ రెండేళ్లు గడుస్తున్నా పనులు ముందుకు సాగలేదు. విచిత్రంగా, 2025లో పాత శిలాఫలకాన్ని తొలగించి, దాని స్థానంలో జీహెచ్‌ఎంసీ నిధులతో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అంటూ కొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేశార‌ని న‌వ‌తారెడ్డి, బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొబ్బ నవతా రెడ్డి మాట్లాడుతూ ఓట్ల కోసమే నాటకాలు ఆడుతూ, 2018, 2023 ఎన్నికల సమయంలో ముస్లిం ఓట్ల కోసం మైనారిటీ ఫంక్షన్ హాల్ కట్టిస్తానని హామీ ఇచ్చి, తీరా ఓట్లు దండుకున్నాక వారిని నట్టేట ముంచారని విమర్శించారు. మైనారిటీల కోసం కేటాయించాల్సిన స్థలంలో, ఇప్పుడు మల్టీపర్పస్ అంటూ బోర్డు తిప్పేయడం ముస్లింలను అవమానించడమేనని అన్నారు. గత ఏడేళ్లుగా అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ ద్వారా గెలిచి, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించడం నైతిక దివాలాకోరుతనమని దుయ్యబట్టారు. త్వరలో రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే, మళ్లీ గుంతలు చూపించి ఓట్లు అడగడానికి ఎమ్మెల్యే కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. ముస్లింలు ఎమ్మెల్యే మోసపూరిత మాటలు నమ్మవ‌ద్ద‌ని, రెండు నెలల్లోపు ఇక్కడ మైనారిటీ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టాల‌ని, లేనిపక్షంలో ముస్లిం, హిందువులు అంద‌రినీ కలుపుకొని ఎమ్మెల్యే ఇంటి ముందు భారీ ధర్నా చేపడుతాం అని నవతా రెడ్డి హెచ్చరించారు. ఈ ప్రభుత్వం విఫలమైతే, రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీనే ఈ ప్రాంతంలో గెలిచి, ప్రజల మెప్పుతో ఫంక్షన్ హాల్‌ను నిర్మిస్తుందని ఆమె స్పష్టం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here