శేరిలింగంపల్లి, మార్చి 22 (నమస్తే శేరిలింగంపల్లి): బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో 2026-27 వార్షిక బడ్జెట్ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశానికి బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మెన్ దుర్గయ్య గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ ఇంటలెక్చ్ వల్ ఫోరమ్ అధ్యక్షుడు, IAS చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఛైర్మెన్ బాలగౌని బాలరాజ్ గౌడ్ , విజయ్ కుమార్ గౌడ్, ఆయిలీ వెంకన్న గౌడ్ లు హాజరై మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో బీసీలు ప్రభుత్వ లెక్కల ప్రకారం 56 శాతం కానీ రాష్ట్ర వార్షిక బడ్జెట్లో 3.85 శాతం అంటే.. రూ.3,24,234 కోట్ల బడ్జెట్ లో బీసీ లకు రూ.12, 511 కోట్లు కేటాయించడం తీవ్ర అన్యాయం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత బడ్జెట్ 2024-25 లో రూ.9,200.32 కోట్లు కేటాయించి రూ.2068.88 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. 2025-2026 గాను రూ.11,405.31 కోట్లు కేటాయించి కేవలం రూ.3500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని, గత రెండు సంవత్సరాలలో రూ.20,605.63 కోట్లు కేటాయించి రూ.5568.88 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. అంటే కేటాయించిన బడ్జెట్లో 27.02 శాతం మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. దీని వల్ల బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక బీసీ వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నారని అర్థమవుతుందని అన్నారు.

ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా సంవత్సరానికి 20వేల కోట్ల రూపాయలు అంటే 3 సంవత్సరాలకు 60 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని మొత్తం 31005 కోట్లు కేటాయించారని, కానీ ఈ సంవత్సరం మినహాయిస్తే ఖర్చు చేసింది రూ.5568.88 కోట్లు మాత్రమేనని అన్నారు. ఇందులోనే కూడా కళ్యాణ లక్ష్మి, ఇందిరమ్మ చీరలు, ఉద్యోగుల జీతాలు ఇస్తే ఇంక ఎక్కడినుండి బీసీలు బాగుపడుతారని ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ ని 90 శాతం నిధులు ఖర్చు చేసినట్లు చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు కేటాయించిన బడ్జెట్ లో 27.02 శాతం ఎట్లా ఖర్చుచేస్తారని అడిగారు. మిగిలిన 72.08 శాతం అంటే రూ.1536.75 కోట్లు ఎక్కడ దారిమళ్లించారని, బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే బీసీ మంత్రులు, MLA లు బీసీల ఘనమైన బడ్జెట్ అని జబ్బలు చరుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం కంటే గత BRS హయాంలో 2014-2023 కి గాను రూ.44,975.61 కోట్లు కేటాయించి అందులో ఖర్చు చేసింది రూ.26,444.74 కోట్లు అని, అంటే 59.24 శాతం ఖర్చు చేశారని, గత ప్రభుత్వం కంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే బీసీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు.





