శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని త్రివేణి పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపికలను అందజేసి అభినందించారు. త్రివేణి పాఠశాలలో ప్రతి విద్యార్థి ఎంతో ఉన్నతంగా ఎదగడానికి విలువలతో కూడిన విద్యను అందిస్తారని ఈ సందర్భంగా కొండా విజయ్ కుమార్ తెలిపారు. ఎందరో త్యాగధనులు సాధించిన స్వాతంత్ర్య భారతదేశానికి ఎంతో మంది ఉన్నత విద్యార్థులను త్రివేణి పాఠశాల అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో త్రివేణి పాఠశాలల డైరెక్టర్ డాక్టర్ వీరేంద్ర చౌదరి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






