శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): డిఫెన్స్ కాలనీకి చెందిన పార్కు స్థలం కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు, సర్వే నంబర్ 267లోని పార్కు స్థలానికి సంబంధించి సర్వే నంబర్ 125లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా చేసిన ఆక్రమణను తొలగించాలని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి కోరారు. ఈ మేరకు డిఫెన్స్ కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్‌కు ఫిర్యాదు చేశారు. పార్కు స్థలానికి సంబంధించి అడ్డదారిలో మంజూరు చేసిన ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని వారు అధికారులను కోరారు. ఈ సమస్యపై గతంలో చందానగర్ డిప్యూటీ కమిషనర్ పేషీలో నిర్వహించిన మూడు ప్రజావాణి కార్యక్రమాల్లో కాలనీ అసోసియేషన్ ఫిర్యాదు చేసిందని, జోనల్ కమిషనర్ పేషీలోనూ రెండు సార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జనం కోసం తరఫున కూడా గతంలో జోనల్ కమిషనర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు కసిరెడ్డి భాస్కరరెడ్డి పేర్కొన్నారు.

కమిషనర్లు మారుతున్నారు.. సమస్య మాత్రం అలాగే ఉంది అని ఆయన అన్నారు. అధికారులు వెంటనే స్పందించి జరిగిన తప్పును సరిచేసి పార్కు స్థలాన్ని పరిరక్షించాలని జోనల్ కమిషనర్‌ను కోరారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మాట్లాడుతూ చెరువులు, పార్కుల్లో ఇచ్చిన అనుమతులు, ఎల్ఆర్ఎస్లపై పరిశీలన చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వెంటనే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కసిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు ప్రసాదరాజు, విఠల్, అడివయ్య, బాలలక్ష్మయ్య తదితరులు జోనల్ కమిషనర్‌ను కలిశారు.





