శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): ఇజ్జత్‌నగర్ వీకర్ సెక్షన్ కాలనీలో హౌస్ ట్యాక్స్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గంగల రాధాకృష్ణ యాదవ్ (కాంటెస్టెడ్ కార్పొరేటర్) సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజనను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాలనీకి చెందిన పలువురు నివాసితులతో కలిసి కమిషనర్‌ను కలిసిన ఆయన, ఇటీవల జారీ చేసిన హౌస్ ట్యాక్స్ డిమాండ్ నోటీసుల్లో చోటుచేసుకున్న తప్పులు, అసమానతలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.

డిమాండ్ నోటీసుల్లో ఆస్తి యజమానుల పేర్లు, ఆస్తి వివరాలు సక్రమంగా నమోదు కాలేదని, దీంతో కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సంబంధిత రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించి, తప్పుగా నమోదైన వివరాలను సరిచేయాలని కోరారు. అలాగే నిజమైన ఆస్తి యజమానుల పేర్లను అధికారిక రికార్డుల్లో సక్రమంగా నమోదు చేసి, సవరించిన హౌస్ ట్యాక్స్ డిమాండ్ నోటీసులను జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను సానుకూలంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను గంగల రాధాకృష్ణ యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, భారతి, పవన్ రెడ్డి, కుమార్, బాలమ్మ, వంశీ యాదవ్, మేఘాంశ్ తదితరులు పాల్గొన్నారు.





