- పదవుల కోసం రాలేదు, ఓడిపోయానని బాధ లేదు
- ప్రజలు అండగా ఉన్నారు, ప్రభుత్వ మనదే
- ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
- డివిజన్‌లో చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలుసు
- అండగా ఉన్నవారికి ధన్యవాదాలు
- విలేకరుల సమావేశంలో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా
గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధమని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. డివిజన్ పరిధిలోని ఖాజాగూడ తెరాస పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొమిరి శెట్టి సాయిబాబా మాట్లాడారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాను ఓడిపోయానని ఏమాత్రం బాధపడడం లేదన్నారు. ప్రజలు తనకు అండగా ఉన్నారని నమ్ముతున్నానన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు, ఒడి దుడుకులు సహజమన్నారు.

డివిజన్ ప్రజలు అధైర్య పడాల్సిన అవసరం లేదని అన్నారు. డివిజన్ అభివృద్దికి కష్టపడి పనిచేశానన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు పదవుల్లోనే ఉండాల్సిన అవసరం లేదని, పదవి లేకున్నా ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేసేందుకు వచ్చానని స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో తనకు చిరకాలం స్థానం ఉండాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. ఎవరో ఏదో అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. డివిజన్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశామో ప్రజలకు తెలుసన్నారు.
అధికారంలో ఉంది తమ ప్రభుత్వమేనన్నారు. కనుక ప్రజలు ఎలాంటి సమస్య ఉన్నా, ఏ కాలనీ, బస్తీలో పెండింగ్‌లో ఏవైనా సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అధిష్టానం అండదండలు ఉన్నాయని, ప్రజలకు సేవ చేసేందుకు మరింత ముందుకు వెళ్తామని అన్నారు. డివిజన్ పరిధిలో అందరం కలసి కట్టుగా ఉండి తెరాస పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తనకు ఓటు వేసిన ప్రజలకు ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించక తప్పదని, తనకు అండగా ఉన్నవారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు నివాళులు…
ఖాజాగూడ తెరాస పార్టీ కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కొమిరిశెట్టి సాయిబాబా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.