గంగారం పెద్ద చెరువును సంద‌ర్శించిన హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్

శేరిలింగంప‌ల్లి, మార్చి 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ లోని గంగారం పెద్ద చెరువును చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంద‌ర్శించారు. శేరిలింగంపల్లి చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారం పెద్ద చెరువులో మట్టి నింపుతున్నారని పిఎసి చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ ఇచ్చిన సమాచారం మేరకు చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, అధికారులతో కలిసి ఏవి రంగనాథ్ సందర్శించారు. చెరువులో మట్టి నింపుతున్న ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ చెరువులో మట్టి నింపుతున్న వారిపై ఇప్పటికే కేసులు పెట్టడం జరిగిందని అన్నారు. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు అయ్యాక చెరువుల్లో మట్టి నింపినవారిపై తామే నేరుగా కేసులు పెడతామని ఆయన చెప్పారు. గంగారం చెరువుకి సంబంధించి అన్ని శాఖల అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భూమి తమది అని చెబుతున్నవారు అన్ని పత్రాలతో హాజరు కావాలని ఆయన సూచించారు. మట్టి డంపింగ్ కు అడ్డుకట్ట వేస్తామని ఆయన స్పష్టం చేశారు. గంగారం చెరువులో ఐదు ఎకరాలు కబ్జాకు గురైందని ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ సమాచారం మేరకు రావడం జరిగింద‌ని తెలిపారు.

అనంతరం చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ గంగారం పెద్ద చెరువు అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ ఆరెక‌పూడి గాంధీ చెరువు సుందరీకరణ పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. చెరువు FTL, బ‌ఫర్ జోన్ కు సంబంధించిన సమస్యలు ఉంటే హైడ్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొనాలని సుచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here