నమస్తే శేరిలింగంపల్లి: ఇంట్లో అత్తమ్మతో గొడవపడి కోడలు ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బత్తుల కరుణాకాంత్ కుటుంబ సభ్యులు ఇంజనీర్స్ ఎన్ క్లేవ్ ఉషోదయ టవర్స్ డి బ్లాక్ ప్లాట్ నంబర్ 407 లో నివాసం ఉంటున్నారు. కరుణాకాంత్ భార్య శ్రీ కోమలకు, తన తల్లికి ఇంట్లో తరచూ చిన్న చిన్న విషయాలకు గొడవపడడం పరిపాటిగా మారింది. భార్య, తల్లి తో మాట్లాడి రాజీ కుదుర్చేందుకు కరుణాకాంత్ ప్రయత్నించినా ఫలితం లేదు. ఈ నెల 17 న శ్రీ కోమల తన కూతురు వర్ణికాకాంత్ ను కొడుతుండగా అత్తమ్మ అడ్డుకుని ఎందుకు కొడుతున్నావని కోడలు శ్రీకోమలను ప్రశ్నించడంతో ఇరువురికి వాగ్వీవాదం చోటుచేసుకుంది. ఈ నెల 19 న తన భార్య శ్రీకోమల కనిపించకపోవడంతో చుట్టుపక్కలా, బంధుమిత్రుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త కరుణాకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చందానగర్ పోలీసులు తెలిపారు. తన భార్య శ్రీకోమల ఇంటి నుంచి వెళ్లినప్పుడు మెంతి కలర్ చుడీధార్ ధరించి ఉందని, ఆమె ఎత్తు 5.6 అడుగులతో పాటు ఆమె తెలుగు, ఇంగ్లీష్ హిందీ భాషలలో మాట్లాడగలదని చెప్పారు.