అరబిందో సంస్థ హౌజ్ కీపింగ్ ఉద్యోగి అనుమానాస్పద మృతి

  • బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ అఖిలపక్ష నేతల ఆందోళన 

నమస్తే శేరిలింగంపల్లి: ఓ కంపెనీలో హౌజ్ కీపింగ్ ఉద్యోగి అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడంతో మృతిని భార్య, ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారు. దీంతో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కంపెనీ ఎదుట అఖిలపక్షం నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్ డివిజన్ ఇజ్జత్ నగర్ లోని అరబిందో రియాల్టీ సంస్థలో హౌస్ కీపింగ్ వర్కర్ గా పనిచేస్తున్న జెట్టి అశోక్ (35) ఎప్పటిలాగే ఉదయం పనికి వెళ్లాడు. కంపెనీలో పనిచేస్తూనే ఉన్నట్టుండి అకస్మాత్తుగా కుప్పకూలాడు. దీంతో సంస్థ ప్రతినిధులు అతన్ని మియాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. కాగా కంపెనీకి దగ్గరలో ఉన్న ఆస్పత్రులను కాదని మియాపూర్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించడమేంటని కంపెనీ వారిని కుటుంబ సభ్యులు, ఆయా పార్టీల నాయకులు ప్రశ్నించారు. అయితే మృతుడు అశోక్ కు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, కంపెనీలో ఏదో జరిగి ఉంటుందని, తన భర్త ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో మృతి చెందలేదని, తన భర్త మృతికి కంపెనీ యాజమాన్యానిదే బాధ్యత అని మృతుడి భార్య జెట్టి మాధవి కన్నీటి పర్యంతమయ్యారు.

మృతుడు జెట్టి అశోక్(ఫైల్)

అఖిలపక్ష నాయకుల ఆందోళన…
అరబిందో కంపెనీలో అకస్మాత్తుగా మృతిచెందిన అశోక్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇజ్జత్ నగర్ లోని కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి రూ.50లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే కంపెనీ యాజమాన్యం మాత్రం ఇందుకు ఒప్పుకోకపోవడంతో పెద్ద ఎత్తున కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. ఈ ఆందోళనలో అఖిలపక్షం నాయకులు గంగల రాధాకృష్ణ యాదవ్, రఘునందన్ రెడ్డి, నగేష్ నాయక్, సురేష్ నాయక్, రామకృష్ణ, చందు యాదవ్, కాసీం, వెంకటస్వామీ, నారాయణ, గోవింద్, శ్రీనివాస్ రెడ్డి, రాజేందర్ రెడ్డి బస్తీవాసులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అరబిందో సంస్థ గేట్ ముందు ఆందోళనకు దిగిన అఖిలపక్ష నేతలు

నాయకుల మధ్య కండువాల‌ లొల్లి…
మృతిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కంపెనీ ఎదుట ఆందోళన చేపట్టిన బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య కండువాల విషయంపై మాటమాటా పెరిగి గొడవకు దారితీసింది. ఒకానొక దశలో ఇరు పార్టీల నాయకులు తోసుకునే స్థాయికి వెళ్లగా అక్కడే ఉన్న మరికొంత మంది నాయకులు సర్ది చెప్పడంతో గొడవ సర్దుమణిగింది. న్యాయం కల్పించేందుకు వచ్చిన నాయకులు గొడవ చేసుకోవడంతో మృతిని కుటుంబ సభ్యులు, అక్కడున్న వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. న్యాయం చేయడానికి వచ్చారా శవ రాజకీయం చేయడానికి‌ వచ్చారా అంటూ చూసిన వారంతా అనుకుంటున్నారు.

పరస్పరం వాగ్వాదంలో కాంగ్రెస్ బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here