నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్స్ లో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తో ఏర్పడిన అపెక్స్ బాడీ కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 11 వ ఎడిషన్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2022ను రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారితో పాటు సామాన్య ప్రజలందరికి క్రెడాయ్ షో ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఇంటిని , స్థలాలను కొనుగోలు చేయాలనుకునే వారు మూడు రోజుల పాటు ఇక్కడ జరిగే క్రెడాయ్ షో ద్వారా అన్ని విషయాలు తెలుసుకోవచ్చన్నారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ 11వ ఎడిషన్ క్రెడాయ్ హైదరాబాద్ ప్రోపర్టీ షో 2022 ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమని తెలిపారు ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల అని అది సాకారం చేసుకోవడానికి ఇలాంటి షో లు ప్రజలకు తోడ్పడతాయని, వినియోగదారుల అభిరుచికి తగ్గట్టు ఉపయోగపడతాయని అన్నారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఉన్న ప్రపంచ శ్రేణి డెవలపర్లు, మెటీరియల్ వెండర్లు, బిల్డింగ్ మెటీరియల్ మాన్యుఫాక్చరర్స్, కన్సల్టెంట్స్, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ ఒకే దగ్గరకు రావడంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో అత్యాధునిక ఆవిష్కరణలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి క్రెడాయ్ కృషి చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరి అవసరాలు, బడ్జెట్ కు తగినట్లుగా డెవలపర్లు ప్రాపర్టీలను ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు జంట నగరాల్లో అత్యుత్తమ గృహ పరిష్కారాలను పొందే అవకాశం కల్పిస్తూ 15 వేలకు పైగా అపార్ట్ మెంట్లు, విల్లాలు, ప్లాట్స్, వాణిజ్య ప్రాంగణాలను ప్రదర్శిస్తున్నారన్నారు. ఇవి వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లమోతు భాస్కర్ రావు, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, క్రెడాయ్ నాయకత్వ బృందం అధ్యక్షుడు పీ రామకృష్ణారావు, జనరల్ సెక్రటరీ వి రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు జి. ఆనంద్ రెడ్డి, కె రాజేశ్వర్, ఎన్ జైదీప్ రెడ్డి, బి జగన్నాధ్ రావు, ట్రెజరర్ ఆదిత్య, జాయింట్ సెక్రటరీలు శివరాజ్ ఠాకూర్, కె రాంబాబు తో పాటు ఈసీ సభ్యులు, డెవలపర్లు, సరఫరాదారులు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.