దిశ జర్నలిస్టు భూమేష్ పట్ల కేపీహెచ్‌బి పోలీసుల తీరుపై శేరిలింగంపల్లి జర్నలిస్టుల నిరసన – సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు టీయూడబ్ల్యుజె నాయకుల ఫిర్యాదు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జర్నలిస్టు తుడుం భూమేష్ పట్ల కెపిహెచ్ బి పోలీసుల వైఖరి, అనుచిత ప్రవర్తన సరికాదని, జర్నలిస్టు అని కూడా చూడకుండా రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ ఇష్టా రీతిగా వ్యవహరించిన కెపిహెచ్ బి పోలీసులపై చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యుజే డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు శుక్రవారం సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను కలిసి వినతి పత్రం అందజేశారు.

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు సమస్యను వివరిస్తున్న టీయూడబ్ల్యుజే నేతలు

టీయూడబ్ల్యుజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, ఉపాధ్యక్షుడు గంట్ల రాజిరెడ్డి, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సాగర్, ప్రధాన కార్యదర్శి మెట్టు జగన్ రెడ్డి, టెంజు అధ్యక్షుడు పి.సాగర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కె.కిషోర్ ల ఆధ్వర్యంలో శేరిలింగంపల్లికి చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని జర్నలిస్టు భూమేష్ కు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఓ పత్రికకు శేరిలింగంపల్లి ఇంచార్జిగా పనిచేస్తున్న తుడుం భూమేష్ మీద కేపీబీహెచ్ పోలీసులు వేధింపులకు పాల్పడడం హేయమన్నారు. భూమేష్ కు సంబంధం లేని విషయంలో కేపీహెచ్ బి పోలీసులు పలుమార్లు పోలీసు స్టేషన్ కు పిలిపించి, సీఆర్పీసీ నోటీసులు తీసుకోవాలని ఒత్తిడి చేశారన్నారు. కేపిహెచ్ బి సీఐ నిజానిజాలు తెలుసుకోకుండా భూమేష్ ను నోటీసులు తీసుకోవాలని ఒత్తిడి తీసుకురావడం హేయమన్నారు. ఇదే క్రమంలో ఏప్రిల్ 23వ తేదీన ఉదయం 9.30 గంటలకు తన ఇంట్లో టిఫిన్ చేస్తున్న భూమేష్ ను కొంతమంది పోలీసులు దౌర్జన్యంగా, బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారని, కనీసం వచ్చినవారు పోలీసులనే సమాచారం సైతం ఇవ్వకుండా అనైతికంగా, చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామికంగా, ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి ఫోన్లు లాక్కున్నారన్నారు. గర్భిణిగా ఉన్న భూమేష్ భార్యకు కనీస సమాచారం ఇవ్వకుండా భూమేష్ ను కేపి హెచ్ బి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి భూమేష్ తో నోటీసులపై సంతకాలు చేయించుకొని, తనకు సంబంధం లేని విషయంలో భూమేష్ ను బాధ్యుడిని చేసేందుకు ప్రయత్నించారని వివరించారు.

దిశ జర్నలిస్టు భూమేష్ కు మద్దతుగా సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న జర్నలిస్టులు

అక్రమాలు, అవినీతి, సామాజిక అంశాలపై గత కొంత కాలంగా వార్తలు రాస్తున్న భూమేష్ ను లక్ష్యంగా చేసుకొని కొంత మంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో కేపిహెచ్ బి పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కమిషనర్ కు జర్నలిస్టు నాయకులు వివరించారు. జర్నలిస్టు భూమేష్ ను దౌర్జన్యంగా, అవమానకరంగా పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులపై చర్యలు తీసుకొని, భూమేష్ కు న్యాయం చేయాలని, అతనికి, అతని కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపిస్తానని, మొత్తం వివరాలు తీసుకొని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టు భూమేష్ కు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. సైబరాబాద్ కమిషనర్ ను కలిసిన వారిలో శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్, టెంజూ కార్యవర్గ సభ్యులతో పాటు దాదాపు 60 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.

కేపీహెచ్ బీ పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీపీ స్టీఫెన్ రవీంద్రకు వినతి పత్రం ఇస్తున్న టీయూడబ్ల్యుజే శేరిలింగంపల్లి జర్నలిస్టులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here