శేరిలింగంపల్లి, ఆగస్టు 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్‌పేట డివిజన్ పరిధిలో ఉన్న హఫీజ్‌పేట విలేజ్ శ్మశాన వాటిక అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. శ్మశానవాటికలో 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి పనులు నత్త నడకన కొనసాగుతున్నాయన్నారు. ఎక్కడికక్కడ రోడ్డును తవ్వి విడిచిపెట్టారని, దీంతో శ్మశానవాటికకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు వాపోయారు. ఈ సమస్యపై ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.






