శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడిగాంధీ పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ విషయంలో మంత్రి కేటీఆర్ ఓటరు నమోదు విషయమై దిశా నిర్దేశం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ గా నమోదు చేసుకోవాలని, గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదునకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హత ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ ని ఓటరుగా నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ సూచించారు.
ఓటరు నమోదు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు అందరూ తొలిరోజే తమ ఓట్లను, తమ కుటుంబ సభ్యుల ఓటర్లను నమోదు చేయించుకోవాలని అన్నారు. ఇందుకు సంబంధించి ప్రతి కార్యకర్త అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకుని ఓటరుగా నమోదు చేయించుకోవాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు తాజా ఓటర్ లిస్ట్ ఆధారంగానే జరుగుతాయని, పాత ఓటు హక్కు కలిగిన వారు కూడా మళ్ళీ ఓటు నమోదు చేసుకోవాలని తెలియయజేశారు.
2017 సంవత్సరం కంటే ముందు డిగ్రీ, ఇంజనీరింగ్ లేదా ఇతర డిగ్రీలలో ఉత్తీర్ణులైన వారు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లుగా నమోదు చేయించుకోవడానికి అర్హులని అన్నారు. ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదుకు పూర్తి చేసి, సంతకం చేసిన దరఖాస్తు ఫాం నంబర్ 18, డిగ్రీ ప్రొవిషనల్ సర్టిఫికెట్ కాపీ, ఆధార్ కార్డు జిరాక్స్, ఓటర్ ఐడీ కార్డు జిరాక్స్, రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, మొబైల్ నెంబర్ (ఓటీపీ కోసం) అవసరం అవుతాయని తెలిపారు.
పైన పేర్కొనబడిన అన్ని పత్రాలను దరఖాస్తుతో పాటు జత చేసి దగ్గరలోని ఎమ్మార్వోకి గానీ, ఆన్ లైన్ ద్వారా గానీ సమర్పించాలని అన్నారు. ఈ ఓటరు నమోదు ప్రక్రియ నవంబర్ 6 వ తేదీ వరకు నిర్విరామంగా కొనసాగుతుందని ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని, ఓటరు నమోదుకు చివరి తేదీ నవంబర్ 6 అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.