ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయిచరణ్ కాలనీలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన గుడ్ విల్ స్టోర్ ను కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ రంగారావులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ గుడ్ విల్ స్టోర్ లు పేద ప్రజలకు, నిజమైన లబ్ధిదారులకు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. మన ఇండ్లలో ఉండే పాత దుస్తులు, వస్తువులు, పుస్తకాలు, పాత టీవీలు, కంప్యూటర్లు, ఇతర వస్తువులు ఏవైనా ఉంటే బయట పారేయకుండా ఈ స్టోర్ లలో భద్రపరిస్తే అవసరం ఉన్న పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. ప్రజలు తమకు అవసరంలేని వస్తువులను అందజేస్తే అవి ఇతరులకు అవసరమయ్యే వస్తువులుగా మారుతాయని అన్నారు. కనుక ప్రజలు తమ తమ ఇళ్లలో ఉండే పాత వస్తువులను బయట వేయకుండా ఈ స్టోర్‌లో భద్రపరచాలని సూచించారు. ఇది చాలా మంచి కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు సంజీవ రెడ్డి, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు రాజేష్ చంద్ర, తెరాస నాయకులు అనిల్ రెడ్డి, పాండు గౌడ్, యాదగిరి, చంద్రమౌళి సాగర్, లక్ష్మీ పాల్గొన్నారు.