- అభినందించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమానికి ఓ బాలిక తన వంతు ఆర్థిక సహాయం అందించింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న మెరిడియన్ స్కూల్‌లో అలేఖ్య వేమూరి (15) అనే బాలిక 11వ తరగతి విద్యనభ్యసిస్తోంది. స్వతహాగా ఆర్టిస్టు అయిన అలేఖ్య తన ఆర్ట్ వర్క్‌లను అమ్మి తద్వారా వచ్చిన మొత్తం రూ.87,200ను చెక్కు రూపంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు అందజేసింది.
తల్లిదండ్రులు విశ్వనాథ్ వేమూరి, జయశ్రీ వేమూరిలతో కలిసి అలేఖ్య సోమవారం ఆ చెక్కును సీపీ వీసీ సజ్జనార్‌కు అందజేసింది. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. నగరంలో బాల కార్మికులుగా పనిచేస్తున్నవారు, అనాథలు, యాచకులుగా మారిన చిన్నారులను చేరదీసి వారికి ఆశ్రయం కల్పించడంతోపాటు విద్యాబుద్ధులు నేర్పించేందుకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం చేపట్టామని, దాని ద్వారా ఎంతో మంది చిన్నారులను చేరదీయడం జరిగిందని అన్నారు. ఆ కార్యక్రమానికి అలేఖ్య రూ.87,200 విరాళం అందజేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్బంగా అలేఖ్యను కమిషనర్ సజ్జనార్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వుమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ పాల్గొన్నారు.