నమస్తే శేరిలింగంపల్లి: గంగారం గ్రామంలో జరుగనున్న ఆషాడమాస బోనాల ఉత్సవాలకు జీడీఎల్ ట్రస్ట్ చైర్మన్ గుడ్ల ధనలక్ష్మి చేయూతనందించారు. స్థానిక టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కంది జ్ఞానేశ్వర్ ఆద్వర్యంలో సోమవారం గంగారం గ్రామంలో నిర్వహించనున్న పలహారం బండి ఊరేగింపు ఉత్సవాల కోసం గుడ్ల ధనలక్ష్మి 5 మేకపోతులను అందజేశారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శమైన బోనాల ఉత్సవాలకు తన వంతు సహకారం అందించడం ఎంతో సంతృప్తిగా ఉందని అన్నారు. యువతను ప్రోత్సహించి బావితరాలకు పండుగల సంస్కృతిని తెలియజేయాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. నిర్వాహకుడు కంది జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ గంగారం గ్రామంలోని నాలుగు పోచమ్మ దేవాలయాలు, ఒక ఈరమ్మ దేవాలయంలో మేకపోతులను బలిస్తామని అన్నారు. అనంతరం పలహారం బండ్ల ఊరేగింపు కొనసాగుతుందని అన్నారు. రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్ గాంధీలతో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, ఇతర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్వాహణ సభ్యులు రోహిత్ ముదిరాజ్, హరీష్, ముముల్ సాయి, ఉదయ్, జీడీఎల్ ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.