శేరిలింగంపల్లి, అక్టోబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపుమేరకు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగారం సంగారెడ్డి బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్న కేటీఆర్ నేరుగా గంగారం సంగారెడ్డికి ఫోన్ చేసి తన వార్ రూమ్ కి రావాలని పిలవడంతో సంగారెడ్డి వార్ రూమ్ కి వెళ్ళారు. గతంలో జరిగిన పరిణామాలు కేటీఆర్ కు సంగారెడ్డి తెలిపారు. ఎందువల్ల పార్టీని వీడవవలసి వచ్చిందో కూలంకుశంగా వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులమని అలాంటిది తమను కొంతమంది వెళ్లగొట్టారని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తనను దగ్గరకు చేర్చుకుందని వెల్లడించారు. గతంలో శేరిలింగంపల్లి బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశానని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో సైతం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నానని కేటీఆర్ కు వివరించారు.

తన మీద నమ్మకం ఉంచి బిఆర్ఎస్ పార్టీలో చేరాలని కేటీఆర్ కోరడంతో పార్టీ కండువా కప్పుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు గంగారం సంగారెడ్డి పేర్కొన్నారు. జరిగిన తీరుకు తాను చింతిస్తున్నానని, తమ దృష్టికి ఎందుకు తీసుకు రాలేదని సంగారెడ్డిని అడిగినట్లు తెలిసింది. గతంలో జరిగింది వదిలేసి ఇప్పుడు పార్టీలో చేరాలని తెలపడంతో పార్టీ కండువా కప్పుకోవలసి వచ్చిందన్నారు. ఏ విషయమైనా తమ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు . తాను అన్ని విధాలుగా ఆదుకుంటానని సంగారెడ్డికి భరోసా ఇచ్చారు. జూబ్లీహిల్స్ లోని వార్ రూమ్ లో కేటీఆర్ బి ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంగారం సంగారెడ్డి మాట్లాడుతూ సొంత గూటికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.





