నమస్తే శేరిలింగంపల్లి: చేపలు చనిపోవడంతో ఆర్థికంగా నష్టపోయిన మదీన గూడ గంగపుత్ర సంఘం వారికి నష్టపరిహారం చెల్లించాలని రాంకీ అధికారులకు చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి సూచించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని రేగులకుంటలో చేపలు చనిపోవడానికి డంప్ యార్డు నుంచి మురికి నీరే కారణం కావడంతో రాంకీ అధికారులతో, జీహెచ్ఎంసీ అధికారులతో గురువారం చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ చేపలు నష్టపోయిన గంగపుత్ర కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉంటామన్నారు. ఇప్పటికే అధికారులతో చేపల మృత్యువాత వలన కలిగిన నష్టం పై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించామన్నారు. గంగపుత్రులకు నష్టపరిహారం చెల్లించేందుకు రాంకీ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. రెండు రోజుల క్రితం చేపలు చనిపోవడంతో దుర్వాసన రాకుండా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఎంటమాలజీ విభాగం అధికారులతో రసాయన పిచికారి చేయించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, రాంకీ జోనల్ హెడ్ వేణు, ఏఎంహెచ్ఓ డాక్టర్ కార్తిక్, మదీనగూడ గంగపుత్ర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.