నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ లో చేసిన అభివృద్ధి శూన్యమని, అక్రమాలు పెరిగాయని బిజెవైఎం రాష్ట్ర నాయకురాలు కసిరెడ్డి సింధూరెడ్డి ఆరోపించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని ఏ కాలనీలో చూసిన సమస్యలు దర్శనమిస్తున్నాయని, సమస్యలను పరిష్కరించడంలో స్థానిక కార్పొరేటర్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. గతంలో ప్రారంభించిన నాలాలు, చెరువుల అభివృద్ధి నేటికి పూర్తి చేయకపోవడం, డివిజన్ లో ఉన్న ఏకైక ఎస్టీపీ నిర్వహణ లోపభూయిష్టంగా ఉందన్నారు. చందానగర్ హైవేపై లింక్ రోడ్లను అభివృద్ధి పేరిట తవ్వి వదిలేసి ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని అన్నారు. గంగారం పెద్దచెరువు అభివృద్ధి చేస్తున్నామని చెబుతూ ఏండ్లు గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి చేయక వైఫల్యం చెందారని ఆరోపించారు. కాలనీల్లో ప్రణాళికాసిద్ధమైన అభివృద్ధి లేకుండా, అక్రమాలకు పెద్దపీట వేయడం అధికార పార్టీ నైజంగా తయారైందని, భవిష్యత్తులో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కసిరెడ్డి సింధూరెడ్డి హెచ్చరించారు. దీప్తిశ్రీనగర్ రేగులకుంట చెరువు కాలుష్యానికి, చేపల మరణానికి కార్పోరేటర్, ఎమ్మెల్యే బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. చెరువు సమీపంలోని చెత్త డంపింగ్ యార్డ్ ను వెంటనే తరలించాలని లేనిచో ఉద్యమిస్తామని ఆమె హెచ్చరించారు.