నమస్తే శేరిలింగంపల్లి: ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగేలా చేపడుతున్న నిర్మాణాన్ని నిలుపదల చేయించాలని కోరుతూ చందానగర్ డివిజన్‌కు చెందిన పలు కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీనీ కలిశారు. అశోక్‌నగర్ వినాయక దేవాలయం వద్ద పాత నిర్మాణాన్ని పునరుద్ధరిస్తూ షెట్టర్లు నిర్మిస్తున్నారని, ఇప్పటికే ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురరవుతున్నాయని, ఈ నిర్మాణం పూర్తవుతే తమ కష్టాలు రెట్టింపు అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
భవానిపురం కాలనీ, శంకర్ నగర్, భవాని శంకర్ నగర్, శంకర్ నగర్ ఫేజ్ 1, శంకర్ నగర్ ఫేజ్ 2 , వెంకటరమణ కాలనీలకు చెందిన వేలాది మందికి ప్రధాన రహదారిగా ఉన్న ఈ మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు కలిగించేలా నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని కోరారు. చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రెడ్డి రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రభుత్వవిప్ గాంధీకి 6 కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు వినతీ పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన గాంధీ సంబంధిత అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చినట్టు బాధితులు తెలిపారు.