నమస్తే శేరిలింగంపల్లి: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కొడుకు కారెక్కించి ప్రాణాలు తీయడం దారుణమని సిపిఐ శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం మాదాపూర్ లోని ఎంఐ చౌరస్తా లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్కీ పూర్ లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేస్తున్న రైతుల ప్రాణాలను తీయడం సిగ్గు చేటన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని, రైతుల ప్రాణాలు తీసిన ఆయన కొడుకును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు కె.చందు యాదవ్, కె. నరసింహారెడ్డి, ఇజ్జత్ నగర్ కార్యదర్శి కాశీం, భాస్కర్, ఖామా మెంట్ శాఖ సహాయ కార్యదర్శి రవి, కృష్ణ, అంజి, ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.
