నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు అన్ని విధాల సహకరిస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలో రూ. 6.30 కోట్ల నిధుల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి అపర్ణ సైబర్ కౌంటీ నుండి మంజీరా డైమండ్ హైట్స్ వరకు రూ. 2 కోట్ల అంచనా వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులను, గోపనపల్లి తండా లో రూ. కోటి 70 లక్షలతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు, ఎన్టీఆర్ నగర్ లో రూ.40 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. నానక్‌రామ్‌గూడ లో రూ.40 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, నానక్‌రామ్‌గూడ ఓఆర్ఆర్ సర్కిల్ నుండి నానక్‌రామ్‌గూడ మెయిన్ రోడ్ వరకు రూ. కోటి పది లక్షలతో బీటీ రోడ్డు పనులకు, సాయి వైభవ్ కాలనీ లో రూ.70 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం అభివృద్ధి పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
