నమస్తే శేరిలింగంపల్లి: మెరుపువేగంతో గోల్స్ చేయగల మాంత్రికుడిగా క్రీడాచరిత్రలో మేజర్ ధ్యాన్ చంద్ సుస్థిర స్థానం సాధించారని, క్రీడా రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపు గా భారత ప్రభుత్వం ధ్యాన్ చంద్ జన్మదినాన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించి ఉత్తమ క్రీడాకారులను సన్మానించు కోవడం జరుగుతుందని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడి బోయిన రామస్వామి యాదవ్ అన్నారు. ఆదివారం చందానగర్ లోని సూపర్ విజ్ జూనియర్ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి కన్వీనర్ రామస్వామి యాదవ్ పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన ఉత్తమ క్రీడాకారులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా రామస్వామి యాదవ్ మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ హాకీ ప్లేయర్ గా, కెప్టెన్ గా , వ్యవహరించి ఒలింపిక్ క్రీడల్లో 1928, 1932, 1936 లలో 3 సార్లు తన గోల్ స్కోరింగ్ విన్యాసాలతో భారతదేశానికి బంగారు పతాకాలను సాధించి భారతదేశ కీర్తి ప్రతిష్టను ఇనుమిడింప జేసిన గొప్ప క్రీడాకారుడు అని కొనియాడారు. 1950 లో ఆయనకు పద్మభూషణ్ బిరుదుతో సత్కరించారని, నేటి యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఉదయాన్నే క్రీడా మైదానానికి వెళ్లి క్రీడలు ఆడటం అలవర్చు కోవాలని తెలిపారు. క్రీడలు విద్యార్థిని, విద్యార్థులకు మానసికంగా, శారీరకంగా ఎదగడానికి ఉపయోగపడతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రామ్మోహనరావు , విష్ణుప్రసాద్, పాలం శ్రీను, నల్లగొర్ల శ్రీనివాసరావు పాల్గొనగా పురస్కారాలు అందుకొన్న క్రీడాకారులు డాక్టర్ కే రాజశేఖర్ , డాక్టర్ జివి రంగారావు , డాక్టర్ కమలాకర్ , కుమారి సుప్రియ, శ్రీనివాస్ యాదవ్, కెనెడి, వి నాగేశ్వరరావు ఉన్నారు.