నమస్తే శేరిలింగంపల్లి: తెలుగు భాష పరిరక్షణకు అధికారభాషా సంఘానికి సంపూర్ణ అధికారులను ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్ నందిని సిద్దారెడ్డి డిమాండ్ చేశారు. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు భాషాభిమానులు, సాహితీ వేత్తల ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన తెలుగు కోసం నడక కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి మాతృభాష పరిరక్షణ సమితి, తెలుగు వెలుగు సాహితీ వేదిక, ఎస్ వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య అభిమానులు ఆదివారం తరలివెళ్లారు. ఈ సందర్భంగా నందిని సిద్దారెడ్డి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార భాష సంఘం అలంకారప్రాయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పాలనా, కార్యాలయ, బోధన భాషగా తెలుగును అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాషా పండితులు, రచయితలు, కోదండరాం నాళేశ్వరం శంకరం చంద్రప్రకాష్ రెడ్డి బడేసాబ్, కవయిత్రులు లక్కరాజు నిర్మల, దాసోజు పద్మావతి, వాణి, మాతృభాష పరిరక్షణ సమితి అధ్యక్షుడు మావిశ్రీ మాణిక్యం గారు, ఎస్ వీ ఫౌండేషన్ ఛైర్మన్, తెలుగు వెలుగు సాహితీ వేదిక, మాతృభాష పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి మోటూరి నారాయణ రావు, అక్షర కౌముది అధ్యక్షుడు తులసి వెంకటరమణాచార్యులు, కవి రాందాస్ తదితరులు పాల్గొన్నారు.