నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచ ఆవాస దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో గల నెహ్రూనగర్ ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాలలో స్నితా దంత వైద్యశాల సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత దంతవైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా పట్టణ జనాభా రోజురోజుకు పెరుగుతోందని, దీంతో మౌలిక వసతుల కల్పన కష్టతరంగా మారి సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. పట్టణాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రపంచ దేశాలు దృష్టిసారించటానికి ఐక్యరాజ్య సమితి అక్టోబర్ మాసం మొదటి సోమవారం ను ప్రపంచ ఆవాస దినోత్సవంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రణాళికా బద్దంగా ఉన్న పట్టణాల్లోనే ఆర్థికాభివృద్ధి మౌళికవసతులు పెరుగుతాయని తెలిపారు. పట్టణీకరణతో పర్యావరణానికి విఘాతం కలగకుండా ఉండేలా పట్టణ సమస్యలపై ప్రభుత్వాలు దృష్టి సారించి సంఘం లోని అసమానతలు తొలగించే దిశగా కృషిచేయవలసిన సామాజిక బాధ్యత ఉందన్నారు. దంత వైద్యులు శ్రీధర్ రెడ్డి దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణి చేశారు. దంత సంరక్షణకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనార్దన్, నజీర్ ఖాన్, ఎమ్ ఎస్ నారాయణ, శివరామకృష్ణ, పాఠశాల హెచ్ఎం ఫిర్డోస్ బేగం, తదితరులు పాల్గొన్నారు.