నమస్తే శేరిలింగంపల్లి: జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవంను పురస్కరించుకుని మాదాపూర్ జిల్లా ప్రజా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆద్వర్యంలో అవగహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్రీయ విశ్వవిద్యాలయం( HCU) భౌతిక శాస్త్ర విభాగ ఆచార్య జి వెంకటయ్య సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్ సివి రామన్ ఫిబ్రవరి 28 నాడు ఆయన పరిశోధన ఆవిష్కరించిన రోజని, వైజ్ఞానిక రంగంలో తొలి నోబెల్ బహుమతి అందుకొన్న కాంతి పుంజం, ప్రతిష్టాత్మక భారతరత్న అందుకొన్న తొలి విజ్ఞాన కెరటం సీవి రామన్ అన్నారు. భౌతికశాస్త్రము లో రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తింపు గా ఆయన గౌరవార్థం ఈరోజుని జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. మానవ జీవితం తో సైన్స్ ముడిపడి ఉందని, సైన్స్ అభివృద్ధి తో మూఢనమ్మకాలు తొలగిపోయి ప్రాణ నష్టం జరగకుండా ఉంటదన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత పురోభివృద్ధి సాధించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. సైన్స్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కావున విద్యార్థిని, విద్యార్థులు సైన్స్ పట్ల మక్కువ పెంచుకొని భవిషత్తు లో మంచి శాస్త్ర వేత్తగా రూపొంది దేశాభివృద్ధి లో పాలుపంచుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా సైన్స్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి మరియు అవగాహన పెంచటానికి దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలలో, కాలేజీలలో, హై స్కూల్స్ లో ఈ సైన్స్ డే నిర్వహించటం ముఖ్యఉద్దేశం అని, ప్రతి సంవత్సరం ఒక థీమ్ తోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని. ఈ సంవత్సరం థీమ్ ” సైన్స్ , టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ ల యొక్క భవిష్యత్తు : విద్య , నైపుణ్యాలు మరియు పనిపై ప్రభావాలు అంశం పరిగణలోకి తీసుకున్నారన్నారు. ప్రధానోపాధ్యాయులు బసవలింగం అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణు ప్రసాద్ , శివరామకృష్ణ, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.






