శేరిలింగంపల్లి, అక్టోబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత న్యూరాలజిస్ట్ కన్సల్టేషన్ ను నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. బుధవారం నుంచి ప్రారంభం అయ్యే ఈ కన్సల్టేషన్ నవంబర్ 10వ తేదీ వరకు ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు ప్రతి సంవత్సరం చేసుకొని బీపీ, షుగర్‌లను అదుపులో ఉంచుకోవాలని అన్నారు. స్ట్రోక్ అనేది తెలియకుండానే ఒక వ్యక్తిని కుంగదీసే ప్రమాదకరమైందన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా వికలాంగుడిగా మారుస్తుందని, కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారి తీస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో స్ట్రోక్‌కి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరికి అవగాహనా కోసం సమగ్ర స్ట్రోక్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 40 సెకన్లకు వ్యక్తులపై స్ట్రోక్ ప్రభావం చూపుతోందని, ఒక్క భారతదేశంలోనే వార్షికంగా 1.66 మిలియన్ల కొత్త కేసులు నమోదవుతున్నాయని అన్నారు. మరణాల రేటు పెరిగింది, 100,000 జనాభాకు 86.5 మరణాలు సంభవిస్తున్నాయి, స్ట్రోక్ భారతదేశంలో మరణానికి నాల్గవ ప్రధాన కారణం, వైకల్యానికి ఐదవ ప్రధాన కారణం అని న్యూరాలజీ విభాగం వైద్యుడు డాక్టర్ హరిరాధకృష్ణ, డాక్టర్ రంజిత్, డాక్టర్ విక్రమ్ కిషోర్ రెడ్డి, డాక్టర్ అభిషేక్ అన్నారు. ఈ కార్యక్రమములో మెడికవర్ హాస్పిటల్స్ వైద్యసిబ్బంది పాల్గొన్నారు.