శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): వరద ముంపుకు గురైన ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికీ అవస్థలు పడుతున్నా తెరాస ప్రజా ప్రతినిధులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం దారుణమని బీజేపీ నాయకుడు మొవ్వా సత్యనారాయణ అన్నారు. శనివారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్‌లో డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శులు ప్రశాంత్ చారి, చిట్టారెడ్డి ప్రసాద్ ల ఆధ్వర్యంలో ఆయన వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మొవ్వా సత్యనారాయణ మాట్లాడుతూ.. ముంపు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం చాలా చోట్ల ఇంకా అందలేదని అన్నారు. ఈ మేరకు బాధితులు గోడును తమ వద్ద వెళ్లబోసుకున్నారని అన్నారు. చాలా చోట్ల డ్రైనేజ్ లు పొంగుతున్నాయని, శానిటేషన్, దోమల బెడదతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం చాలా బాధాకరమని అన్నారు. వరదముంపు బాధితులు టీఆర్ఎస్ కార్యకర్తలేనా అని ధ్వజమెత్తారు. పండగ రోజు కూడా తినడానికి తిండి లేన దయనీయ పరిస్థితిలో ఉన్న ముంపు బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రజలకు ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితులందరికీ సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు నర్రా జయలక్ష్మీ రెడ్డి, జిల్లా నాయకులు చింతకింది గోవర్ధన్ గౌడ్, చంద్రమోహన్, శివకుమార్, శ్రావణ్ పాండే, అరవింద్ గుప్తా, అశోక్ నాయక్, సందీప్, సురేష్, కుమార్ యాదవ్, కిషోర్ యాదవ్, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.