శేరిలింగంపల్లి, జనవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): అర్హత ఉన్న ప్రతిఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు అందిస్తామని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మాదాపూర్ వార్డ్ కార్యాలయంలో అధికారుల అధ్యక్షతన ఈ నెల 26న ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న అభివృద్ధి పథకాలు – ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల అమలు, లబ్దిదారుల ఎంపిక కొరకు ఏర్పాటు చేయనున్న ఇందిరమ్మ సభను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అధికారులు చూపిస్తున్న చొరవను అడిగి తెలుసుకున్నారు. అధికారులు ప్రజలకు అర్ధం అయ్యేలా తగు చర్యలు తీసుకుంటూ వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దరఖాస్తుల స్వీకరణ చేయవలసిందిగా సూచించారు. ప్రజలు ఎలాంటి అధైర్యం లేకుండా వారికి ఉన్న సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమం గురించి అవగాహన లేని స్థానికులకు తెలిసినవారు వెళ్లి వారికి తెలియజేసి, అర్హులైన లబ్ధిదారులను ఎంచుకునే క్రమంలో ప్రజలు కూడా తమ వంతు సాయం చేయాల్సిందిగా ఆయన కోరారు. వార్డ్ వద్దనే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, దరఖాస్తులు ఇచ్చి లబ్దిదారులందరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.
