శేరిలింగంపల్లి, జూలై 19 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న SIR-2026 (ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ) కార్యక్రమంలో భాగంగా ప్రతి అర్హుడూ తప్పనిసరిగా ఓటు హక్కు పొందేలా చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రజా షెల్టర్ ప్రాంతంలో బూత్ లెవెల్ అధికారులు (BLOలు), బీజేపీ బీఎల్‌ఏ-2 ప్రతినిధులతో కలిసి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి ఫారాలు అందజేస్తూ, ఎన్నికల కమిషన్ పొడిగించిన గడువును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో BLOలు అన్ని రాజకీయ పార్టీల బీఎల్‌ఏలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయాలని అన్నారు. అనంతరం ఓటర్లు ఫారాలను పూర్తిగా నింపి, అవసరమైన ప్రభుత్వ గుర్తింపు పత్రాలతో కలిసి BLOలకు అందజేయాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో BLOలు ఒకేచోట ఉండి ఫారాలు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని, అలాంటి విధానం సరైంది కాదన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించినప్పుడే నిజమైన అర్హులైన ఓటర్లను గుర్తించే అవకాశం ఉంటుందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతోపాటు దొంగ, డూప్లికేట్ ఓట్లను తొలగించడం ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజూ పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల సంఖ్య, తిరిగి స్వీకరించిన ఫారాలు, ఫామ్-6, ఫామ్-7, ఫామ్-8 దరఖాస్తుల వివరాలను BLOల నుంచి సేకరించి పార్టీ నాయకత్వానికి తెలియజేయాలని బీజేపీ బీఎల్‌ఏ-2 ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ ముదిరాజ్, ఆకుల లక్ష్మణ్, శ్రీనివాస్, రాము, రెడ్డమ్మ, మహేష్, రవి ప్రకాష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.





