శేరిలింగంపల్లి, జూలై 19 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ 4వ ఫేజ్ షటిల్ కోర్టులో నిర్వహించిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమంలో విజేతలైన విద్యార్థులకు జీహెచ్‌ఎంసీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ ప్రీతమ్ రెడ్డి బెల్టులు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. గాడ్స్ ఓన్ వారియర్స్ షోటోకన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సూర్య ఉదయం దినపత్రిక తెలంగాణ ఎడిటర్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కరాటే అకాడమీ మాస్టర్ అబ్దుల్ నబీ, ఫౌండర్ మాస్టర్ వి. పృథ్వీరాజ్, సీనియర్ మాస్టర్లు శ్రీశైలం, శ్రీనివాస్‌లు ముఖ్య అతిథులను శాలువాలతో సన్మానించారు. అనంతరం బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రీతమ్ రెడ్డి మాట్లాడుతూ కరాటే కేవలం ఆత్మరక్షణ విద్య మాత్రమే కాదని, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వంతోపాటు మానసిక వికాసాన్ని పెంపొందించే గొప్ప మార్షల్ ఆర్ట్ అని అన్నారు. విద్యార్థులు నిరంతరం సాధన చేస్తూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.

కరాటే మాస్టర్ పృథ్వీరాజ్, సీనియర్ మాస్టర్ శ్రీశైలం మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో కృషితో శిక్షణ పూర్తి చేసి బెల్ట్ పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహకారంతోనే విద్యార్థులు ఈ విజయాలను సాధించగలిగారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం డివిజన్ అధ్యక్షుడు హుస్సేన్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి సులోచన, బీజేవైఎం నాయకులు భార్గవ్, శ్యామ్, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.





