ఇజ్జత్ నగర్‌లో ఘనంగా అంగన్ మిలన్ సేవ కార్యక్రమం

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో, జిల్లా ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్ నేతృత్వంలో శేరిలింగంపల్లి పరిధిలోని ఇజ్జత్ నగర్‌లో అంగన్ మిలన్ సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులతో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవికుమార్ యాదవ్ ముచ్చటించారు. చిన్నారుల శారీరక, మానసిక ఉల్లాసానికి ఉపయోగపడే పలు ఆటవస్తువులను వారికి అందజేశారు.

ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు చిన్నారుల ఆరోగ్యం, సరైన పోషణపై ఆధారపడి ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. పోషణ్ అభియాన్, మిషన్ సక్షమ్ అంగన్‌వాడీ వంటి పథకాల ద్వారా అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ఆధునీకరణ, పౌష్టికాహార లోపం నివారణతో పాటు గర్భిణులు, బాలింతలకు ఆర్థిక సహాయం అందించే ప్రధానమంత్రి మాతృ వందన యోజన (PMMVY) వంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ప్రజారోగ్యం, పోషకాహార పరిరక్షణలో అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్ల సేవలు కీలకమని కొనియాడారు.

రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ తల్లి, బిడ్డల ఆరోగ్య పరిరక్షణలో అంగన్‌వాడీ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా పేద వర్గాలకు చేరేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సమాజ సేవలో బీజేపీ కార్యకర్తలు ముందుంటారని, సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా ప్రజలకు మరింత చేరువవుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి పద్మ, జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులు సాగర్, డివిజన్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, ఆనంద్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి, జితేందర్, శ్రీనివాస్ రెడ్డి, భారతి లక్ష్మి, యాదమ్మ, పవన్ రెడ్డి, ఆశిక్ కుమార్, కురుమయ్య, గురు యాదవ్, బాల కుమార్, మోహన్ నాయక్, చంటి నాయక్, శివ యాదవ్, లోకేష్, మంజు, పట్టాభిరామ్, రోజా రమణి, ఆమని, మల్లేష్, రాము యాదవ్, నిఖిల్‌తో పాటు బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్లు, స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here