శేరిలింగంపల్లి, అక్టోబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ కాలనీలో రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద రూ.70 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న వరద నీటి కాలువ, సీసీ రోడ్డు నిర్మాణ పనులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, CMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ఆయన పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. మంజీరా పైప్‌లైన్ రోడ్డు నుంచి మసీద్‌బండకు వెళ్లే మార్గంలోని రైల్వే అండర్‌పాస్ రోడ్డు పనులు చివరి దశకు చేరుకున్నాయని, వారం రోజుల్లోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

రైల్వే అండర్‌పాస్ వద్ద తరచూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని, ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనదారులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని రూ.70 లక్షలతో వరద నీటి కాల్వ, సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. వర్షాకాలంలో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పక్కా ప్రణాళికతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని గాంధీ తెలిపారు. వరద నీటి కాల్వ, సీసీ రోడ్డు పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించి సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని చెప్పారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని గాంధీ పునరుద్ఘాటించారు. హఫీజ్‌పేట్ డివిజన్‌తో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో CMC ఇంజనీరింగ్ విభాగం DE ఆనంద్, AE భాస్కర్, నాయకులు సత్యం, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





