శేరిలింగంపల్లి, అక్టోబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఖానామెట్ సర్వే నంబర్ 41/13లో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడాలని సీపీఐ శేరిలింగంపల్లి నియోజకవర్గ కమిటీ డిమాండ్ చేసింది. సుమారు 2 ఎకరాల 5 గుంటల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతానికి గురవుతోందని, దాని మార్కెట్ విలువ సుమారు రూ.300 కోట్ల వరకు ఉంటుందని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆక్రమణకు సంబంధించిన రేకులను, ఇతర నిర్మాణాలను తొలగించి, ఆ స్థలం ప్రభుత్వ భూమి అని సూచించే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. భూమిని పరిరక్షించేందుకు పోలీసు నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

ఖానామెట్ ప్రాంతంలోని ప్రభుత్వ భూములన్నింటినీ సమగ్రంగా సర్వే చేసి, ఎంత భూమి ఆక్రమణకు గురైంది, ఎంత భూమి మిగిలి ఉంది అనే వివరాలను తేల్చాలని సీపీఐ నాయకులు కోరారు. ఆక్రమిత ప్రభుత్వ భూములను రక్షించేందుకు హైడ్రా సహకారం తీసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, ఆక్రమణలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శేరిలింగంపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌కు సీపీఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. రెండు రోజుల్లో అధికారులు చర్యలు తీసుకోకపోతే పెద్ద సంఖ్యలో సీపీఐ కార్యకర్తలతో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పానుగంటి పర్వతాలు హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు టి. రామకృష్ణ, శేరిలింగంపల్లి మండల సీపీఐ కార్యదర్శి కే. చందు యాదవ్, కే. వెంకటస్వామి, డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. నారాయణ, సీపీఐ మండల కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





