నమస్తే శేరిలింగంపల్లి: బసవతారక నగర్ పేదల ఉసురు ముఖ్యమంత్రి కేసీఆర్ కు తప్పకుండా తగులుతుందని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బసవతారక నగర్ పేదలను గురువారం హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాజీ శాసన సభ్యులు బిక్షపతి యాదవ్, ఏనుగు రవీందర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, ఉద్యమ నాయకులు విఠల్ తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ బసవతారక నగర్ వాసులు మొదటగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న సమయంలో ఇక్కడ హైటెక్ సీటీ లేదు, ఐటీ కారిడార్ లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మనుషుల గురించి, పేదల గురించి ఆలోచించకుండా మానవత్వాన్ని మరిచాడని ఎద్దేవా చేశారు. పేదలకు పక్కా ఇళ్లు మంజూరు చేశాకే వీరి జోలికి రావాల్సిందన్నారు. ఈ ప్రాంతం నుంచి పేదలను తరిమే హక్కు ఎవరికీ లేదని, కేసీఆర్ ఖబడ్దార్ అని హెచ్చరించారు. పేదల ఉసురు పోసుకుంటున్న నిన్ను, నీ ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చే రోజు దగ్గరలోనే ఉందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడి ప్రాంత ప్రజలకు కడియం శ్రీహరి ఎన్నో హామీలిచ్చి మరిచిపోయారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు ఇక్కడి పేదల గోడు పట్టదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని నేడు విస్మరించడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ ను చూసి సభ్య సమాజం అసహ్యహించుకుంటుందన్నారు. ఇక్కడి పేదలకు న్యాయం జరిగేంత వరకు అందరం కలిసి కట్టుగా పోరాడుతాం అని ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.