నమస్తే శేరిలింగంపల్లి: వివేకానంద నగర్ కాలనీ అభి టిఫిన్ సెంటర్ వద్ద కాంట్రాక్టర్ నిర్లక్యంతో రోడ్డు నిర్మాణం చేపట్టిన ఆర్నెళ్లకే కుంగిపోవడం చూస్తుంటే అధికారులు,ప్రజాప్రతినిధుల అలసత్వం కొట్టొచ్చినట్టు కనబడుతుందని బిజెపి రాష్ట్ర నాయకులు ఏకాంత్ గౌడ్ పేర్కొన్నారు. దెబ్బతిన్న రోడ్డును బిజెపి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏకాంత్ గౌడ్ మాట్లాడుతూ వివేకానంద నగర్ డివిజన్ అభిటిఫిన్ సెంటర్ వద్ద రూ. 53 లక్షల అంచనా వ్యయంతో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ శంకుస్థాపన చేసిన శిలాఫలకం ముందే నిర్మించిన బీటీ రోడ్డు ఆరు నెలలు గడవకముందే రోడ్డు కుంగిపోవడం దారుణమన్నారు.
కాంట్రాక్టర్ నాణ్యతలేని పనులు చేయడం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజాధనం వృథా అవుతుందని వాపోయారు. ప్రజాధనంతో చేసే పనుల్లో ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కమిషన్లకు అలవాటు పడి నాణ్యత లేని పనులు చేయించడంతో రోడ్డు కుంగిపోయిందన్నారు. ఈ నష్టానికి బాధ్యులైన సదరు కాంట్రాక్టర్, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వివేకానంద నగర్ డివిజన్ ఇంజనీరింగ్ అధికారులు, ఏఈ పై తక్షణం చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.