నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహేబ్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక నిర్ణయమని, 75 ఏండ్ల స్వతంత్ర భారత దేశంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్‌కు తెలంగాణ ప్రభుత్వం సమున్నత గౌరవం కల్పించింది. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరును పెట్టి చారిత్రక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరపున ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కేంద్ర పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్‌కు భారత సామాజిక దార్శనికుడు మహామేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమన్నారు.
ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శమన్నారు. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నదన్నారు. అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్-3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.