- తెలంగాణ ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): ముదిరాజ్ కులస్తులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని తెలంగాణ ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం చందానగర్ డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం లో ముదిరాజ్ కులస్థులపై రోజు రోజుకీ దాడులు పెరిగి పోతున్నాయన్నారు. ముదిరాజ్ ల ఓపికను పరీక్షిస్తున్నాయన్నారు. ఈ దాడులను ముదిరాజ్ యువజన సమాఖ్య తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. ముదిరాజ్ మత్స్యకారులు, ముదిరాజ్ ల చెరువులు, సొసైటీలు ఉన్న గ్రామాలలో దాడులు, ముదిరాజ్ మహిళలపై దాడులు జరిగాయని, జగిత్యాలలో ముదిరాజ్ మత్స్యకారులు మెండే రమేశ్ ముదిరాజ్ పై జరిగిన దాడిని, మంథనిలో ముదిరాజ్ కుల దైవం అయిన పెద్దమ్మ తల్లి గుడి ఎదుట శ్మశానవాటిక నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ముదిరాజ్ ల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసే విధంగా ఉందని అన్నారు.
వరంగల్ లో కొన్ని చోట్ల ముదిరాజ్ మత్స్యకారుల పై దాడులు జరుగుతున్నాయని, నల్గొండలో చెరువులు లూటీ చేస్తూ ముదిరాజ్ మత్స్యకారులని నష్టపరుస్తూ, ఆర్థిక వనరులపై దెబ్బ తీస్తూ, ఆర్థికంగా ఎదగనీయకుండా చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. ఎవరైతే ముదిరాజ్ లను అర్థికంగా ఎదగనీయకుండా తమ ఆర్థిక వనరులను దెబ్బ తీస్తున్నారో వారందరికీ త్వరలోనే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ముదిరాజ్ లపై అనుచిత వాఖ్యలు చేస్తున్న మంత్రులు, ముదిరాజ్ లపై జరుగుతున్న దాడులకు త్వరలోనే తెలంగాణ ముదిరాజ్ యువజన సమాఖ్య తరపున సమాధానం చెప్తామని, దాడులు చేస్తుంటే, అనుచిత వాఖ్యలు చేస్తుంటే చూస్తూ ఊరుకునే రోజులు పోయాయని అన్నారు. ముదిరాజ్ మహిళలపై దాడికి పాల్పడిన, అనుచిత వాఖ్యలు చేసిన వారికి తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. బాధితులకు అండగా నిలబడి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ముదిరాజ్ లకు ఏ కష్టం వచ్చినా తెలంగాణ ముదిరాజ్ యువజన సమాఖ్య అండగా నిలబడుతుందని అన్నారు.
Hi