నమస్తే శేరిలింగంపల్లి: దళిత బంధు పథకం ద్వారా మంజూరైన యూనిట్లతో లబ్దిదారులు స్వతహాగా జీవనోపాధి పొంది జీవితాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి – బ్లాక్ కి చెందిన అనిల్ కు మంజూరైన కారును ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశల వారిగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలు అవుతుందన్నారు. దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, దళితులలో ద్విగుణీకృత మార్పు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. శేరిలింగంపల్లి నియోజవర్గంలో దళిత బంధు పథకానికి ఆయా యూనిట్లను అందజేసేందుకు వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. లబ్ధిదారులు భవిష్యత్తులో మిగతా వారికి ఆదర్శంగా నిలిచేలా ఉండాలని, పక్క ప్రణాళిక తో యూనిట్లను నెలకొల్పి భావి తరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, కాశీనాథ్ యాదవ్, బాబు మోహన్ మల్లేష్, రూప రెడ్డి తదితరులు పాల్గొన్నారు.