నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ కాలనీ, మక్తా గ్రామ ప్రజలకు ఇబ్బందిగా మారిన దీప్తిశ్రీ నగర్ డంపింగ్ యార్డును తరలించాలని, రేగులకుంట చెరువులో మురికి నీరు చేరకుండా ఎస్టీపీ ప్లాంట్ ను చేయాలని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. డంపింగ్ యార్డు వల్ల వచ్చే దుర్వాసనతో దీప్తిశ్రీ నగర్ కాలనీ వాసులు, మక్తా గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. డంపింగ్ యార్డు తరలించే వరకు ఎలాంటి దుర్వాసన రాకుండా చూడాలని కార్పొరేటర్లు జడ్సీ శంకరయ్యకు వివరించారు.
సానుకూలంగా స్పందించిన జడ్సీ శంకరయ్య మాట్లాడుతూ డంపింగ్ యార్డును త్వరలోనే తరలించనున్నట్లు, అంతవరకు నగరంలో పలు చోట్ల నిర్మించిన సాంకేతిక ఇంటిగ్రేటెడ్ డంపింగ్ యార్డు తరహా డంపింగ్ యార్డు నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. రేగులకుంట చెరువు లో మురికి నీరు కలవకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. డంపింగ్ యార్డుకు చెత్తను తరలించే ఆటోలు దీప్తిశ్రీ నగర్ కాలనీ రహదారి పై కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని జోనల్ కమిషనర్ ను కార్పొరేటర్లు కోరారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, ఎస్ఈ శంకర్ నాయక్, ఏఎంఓహెచ్ డాక్టర్ కార్తీక్, రాంకి జోనల్ హెడ్ సుశాంత్, ఈఈ శ్రీకాంతి, డీఈ శిరీషాదేవి, ఏఈలు ప్రతాప్, అనురాగ్ తదితరులు పాల్గొన్నారు.