శేరిలింగంపల్లి, జనవరి 17 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా శనివారం మధ్యాహ్నం నూట యాభై మందికి పైగా భక్తులు అన్నదాన ప్రసాదం ద్వారా లబ్ధి పొందారు. అనంతరం సాయంత్రం నిర్వహించిన నృత్యార్చన కార్యక్రమం సందర్భంగా మంచిర్యాలకు చెందిన సి.స్నేహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించగా, నాట్య గురువు డా. కె.వి. చిదానందకుమారి మార్గదర్శకత్వంలో శిష్యులు స్వామివారికి నృత్య కైంకర్యాన్ని అర్పించారు. సోలో ప్రదర్శనలలో అమేయ – ఆలమేలుమంగా హరి, శ్రీరాధ్య – కొండలలో, వర్ధిని – ఆదివో అల్లదివో, మౌనిక పున్నం, లాస్య, ఆర్యాహి, ఆరోహి, దివిశశ్రీ, లక్ష్మిశిశిర, ఎనగంటి నిహిరారావు, మండల ఆర్హ, దాసరి దీత్యశ్రీ, మైరా ఋషివ్, కొప్పడి ఆధ్య, అలుగువెల్లి కృతిక రెడ్డి, జక్కుల యామిని, పులిపాక స్పూర్తి శివన్య, కొమ్ము శర్లి, బూరుగు ప్రవాస్య, వడ్నాల చందన సిరి తదితరులు తమ నృత్య నైపుణ్యంతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు.

ఇదే కార్యక్రమంలో మూషిక వాహన, భావములోన, చిరుతనవ్వులవాడే చిన్నక్క, కులుకగా నడవరో, బ్రహ్మమొక్కటే, జగదాపు చనువుల జాజర అనే అన్నమయ్య సంకీర్తనలకు గ్రూప్ నృత్య రూపంలో అద్భుత భావాభినయాన్ని ప్రదర్శించి, స్వామివారికి భక్తిపూర్వక నృత్యార్చన చేశారు. కార్యక్రమం అనంతరం పద్మశ్రీ డా. శోభారాజు ఒక అన్నమయ్య సంకీర్తనకు భావార్థ వివరణ ఇచ్చి, నృత్య ప్రదర్శన గురించి మాట్లాడుతూ నాట్య గురువు డా. కె.వి. చిదానందకుమారి తమ శిష్యులను సాహిత్య భావం, లయ, అభినయం సమన్వయంతో తీర్చిదిద్దుతున్న విధానం ప్రశంసనీయం అని అభినందించారు. వారి శిష్యుల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచాయని తెలిపారు. అన్నమాచార్య భావనా వాహిని పక్షాన కళాకారులుకు సంస్థ వ్యవస్థాపకురాలు శోభారాజు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నంద కుమార్ కలిసి ప్రతి ఒక్కరికి జ్ఞాపికను అందించి ప్రశంసించారు. చివరగా శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణతో ఈ అన్నమ స్వరార్చన–నృత్యార్చన కార్యక్రమం భక్తి, సంగీత, నాట్య మాధుర్యంతో విజయవంతంగా ముగిసింది.





