హైటెక్‌సిటీ మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్స్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రామా అండ్ ఆక్యూట్ సర్జరీ విభాగం ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రపంచ ట్రామా దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ, ప్రాణాలను రక్షించడంలో మరో ముఖ్యమైన అడుగు వేసింది. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రామా అండ్ ఆక్యూట్ సర్జరీ విభాగాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌ వంటి నగరాల్లో ట్రామా (ఆకస్మిక గాయాలు) ఇప్పుడు కేవలం రోడ్డు ప్రమాదాలకు మాత్రమే పరిమితం కాదు. మెట్లు జారిపడటం, నిర్మాణ ప్రాంగణ ప్రమాదాలు, ఇంటి, కార్యాలయ గాయాలు వంటి సంఘటనలు కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం సుమారు 4.6 లక్షల రోడ్డు ప్రమాదాలు, 1.5 లక్షల మరణాలు, 3 లక్షల తీవ్రమైన గాయాలు సంభవిస్తున్నాయి. వీటిలో దాదాపు 50% మరణాలు సరైన సమయాన చికిత్స అందితే నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్‌లో ఈ విభాగాన్ని డా. దామోదర్ కాకుమాను, కన్సల్టెంట్ ట్రామా & ఆక్యూట్ కేర్ సర్జన్‌ నేతృత్వంలో ప్రారంభించారు. ఆయ‌న AIIMS, న్యూ ఢిల్లీ నుండి M.Ch. (Trauma Surgery & Critical Care) పట్టా పొందారు. ఆయ‌న మార్గదర్శకత్వంలో మెడికవర్‌లో అత్యాధునిక ట్రామా ప్రోటోకాల్స్‌, వేగవంతమైన స్పందన వ్యవస్థలు, బహుళ వైద్య విభాగాల సమన్వయంతో రోగుల ప్రాణరక్షణలో కొత్త దిశను చూపిస్తున్నారు. నగరాల్లో ట్రామా కేసులు చాలా సాధారణంగా జరుగుతుంటాయి కానీ వాటిని చాలా సార్లు నిర్లక్ష్యం చేస్తారు. మొదట్లోనే గుర్తించి, వెంటనే స్పందిస్తే ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు అని డా. దామోదర్ కాకుమాను తెలిపారు. మెడికవర్ హైటెక్ సిటీలోని లెవల్–1 ట్రామా సెంటర్‌లో 24×7 అత్యవసర వైద్య సేవలు, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్, జనరల్, ప్లాస్టిక్ సర్జరీ, క్రిటికల్ కేర్, ఫిజియోథెరపీ వంటి విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయ‌న్నారు. ప్రమాదం జరిగిన క్షణం నుండి పూర్తిస్థాయి కోలుకునే వరకు రోగికి సమగ్ర సేవలు అందించేలా విభాగం రూపొందించబడింద‌న్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here