మాదాపూర్, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్‌లోని అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షురాలు, పద్మ శ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు ఆధ్వర్యంలో శనివారం వినాయక చవితి, అన్నమయ్య స్వరార్చన, స్వామి వారి సంకీర్తన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తొలుత విష్ణు సహస్రనామ స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, అన్నమాచార్య అష్టోత్తర శతనామావళి, అన్నమయ్య గాయత్రి అనే గురు స్తుతితో ప్రారంభించగా, స్వరార్చనలో భాగంగా గానామృతం మ్యూజిక్ స్కూల్ గురువు స్మిత కృష్ణ కుమార్, శిష్యులు హాసిని, హృద్య, అదిత్రి, మధుర, సుచిత్ర, తన్వి, సంయుక్త, ఉదిత్, రెయ, మిత్రన్, ధృవ్, స్వాతి, అదితి, సహానా, వెన్నెల, తష్విక, హరిని కలిసి కట్టుగా వారనాస్య వక్రతుండ, శ్రీమన్నారాయణ, గోవిందాశ్రిత, గోవింద ఆది, నారాయణతే, రామా రామచంద్ర, జయ జయ నృసింహ, ముద్దు గారే, బ్రహ్మమొక్కటే, చూడరమ్మ అనే సంకీర్తనలను మధురంగా పాడి అలరించారు.
శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామివారిని భక్తి పూర్వకంగా సేవించి అందరినీ రంజింపజేశారు. వీరికి వయోలిన్ పై రోహిత్ కుమార్, మృదంగం పై అమోఘ్ వాయిద్య సహకారం అందించారు. అనంతనం శోభా రాజు ఒక అన్నమయ్య సంకీర్తనకు విశ్లేషణ ఇచ్చారు. అనంతరం కళాకారులకు శోభా రాజు ఙ్ఞాపికలను అందించారు. చివరిగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మంగళహారతి ఇచ్చి ప్రసాదాన్ని పంచిపెట్టారు.