శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ పార్టీ గతంలో కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్‌కు అనుగుణంగా బీసీ కులాల జన గణన చేపట్టాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్, బిసి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ శనివారం ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ కి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ 54 శాతం ఉన్న బీసీలకు న్యాయం చేయాలని అన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని, చట్టసభల్లోనూ అన్నింటా 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం అమలు పరచాలని కోరారు.
విద్యా ఉద్యోగంలోనూ, వైద్యం, అన్నింట తమకు 42 శాతం బడ్జెట్ కేటాయించి పేదలు, నిరుపేదలైన బీసీలకు ఖర్చు చేయాలని కోరారు. అత్యంత వెనుకబడిన బీసీ కులాలు విద్యలో అన్యాయానికి గురవుతున్నారని, అదే రకంగా వైద్యం విషయంలో కూడా వారికి సరి అయిన చికిత్స సదుపాయాలు లేక బాధ పడుతున్నారని అన్నారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ముఖ్యంగా బీసీల జనాభా 54 శాతం ఉన్నా, ఓట్లు మావి సీట్లు మీవి అన్నట్లుగానే జరుగుతుందని, కాబట్టి తమకు రిజర్వేషన్ కల్పించి రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య అన్ని రంగాల్లో బీసీలకు న్యాయం చేసి రిజర్వేషన్ అమలు పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రావు, బీఆర్ఎస్ ఫౌండర్ మల్లిఖార్జున శర్మ, డివిజన్ ప్రెసిడెంట్ సంగారెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షుడు తులజా రెడ్డి, దుర్గారెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాస్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, బిసి నాయకుడు సలీం, మైనార్టీ నాయకులు, బిసి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.