సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): మంగళవారం నిర్వహిచ తలపెట్టిన భారత్ బంద్ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజలు తాము ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని చూసుకుని ప్రయాణాలు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ముఖ్యమైన కూడళ్లు, జంక్షన్లలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు బంద్ సందర్భంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుందని, కనుక ప్రజలు ట్రాఫిక్ రద్దీని గమనించాలని కోరారు. అవసరం అనుకుంటే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ఎవరికైనా సమస్య వస్తే సైబరాబాద్ కంట్రోల్ రూం నంబర్లు 040-2785 3413, 040-2300 2424, 9490617100, 8500411111 లకు ఫోన్ కాల్ చేయవచ్చన్నారు. విమాన ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు, వచ్చేందుకు ఔటర్ రింగ్ రోడ్డును ఉపయోగించుకోవాలని సూచించారు. అత్యవసర వాహనాలకు కచ్చితంగా దారి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే పోలీసులను పైన తెలిపిన నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.