శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని చిన్న అంజయ్య నగర్ లో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గురువారం స్థానికులతో కలిసి పర్యటించారు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతంగా ఉన్న చిన్న అంజయ్య నగర్ లోని పలువురి ఇళ్లల్లోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో పలువురు ఇబ్బందులకు గురైనట్లు కార్పొరేటర్ దృష్టికి స్థానికులు తీసుకువచ్చారు.
వర్షపు నీరు ప్రవహించే కాలువ ఎత్తు చిన్నదిగా ఉండడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతోందని, వెంటనే ఈ కాలువ ఎత్తును పెంచేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదేవిధంగా కాలనీలో మిగిలిన సీసీ రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కరోనా నివారణ కోసం కార్పొరేటర్ సొంత ఖర్చులతో తయారు చేయించిన శానిటైజేషన్ వెహికిల్ ద్వారా సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.
కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ వెంట ఏఈ సునీల్, చిన్న అంజయ్య నగర్ టీఆర్ఎస్ బస్తీ కమిటీ అధ్యక్షుడు రాజు నాయక్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు బాబర్, నాయకుడు రవి నాయక్ తో పాటు సందయ్య నగర్ కాలనీ అధ్యక్షుడు బసవరాజు తదితరులు ఉన్నారు.