శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కేశవనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలోని సమస్యలను ప్రధాన ఉపాధ్యాయురాలు సునీత గంగాధర్ రెడ్డి దృష్టికి తీసుకురాగా, కార్పొరేటర్ సమస్యలను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో ఉన్న సమస్యలు, మౌలిక సదుపాయాలపై ముఖ్యంగా మంచినీటి సౌకర్యం, ప్రహరీ గోడ, వాలంటీర్ల అవసరం, భోజనశాల డోర్, పాఠశాల గేటు మరమ్మత్తులు, విద్యుత్తు సదుపాయాలు తదితర అంశాలపై కృషి చేయాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని కోరారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని, త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదివేలా పాఠశాలను తీర్చిదిద్దుతామని తెలిపారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కష్టపడి చదివితే రానున్న జీవితంలో ఉత్తమ భవిష్యత్తు సొంతమవుతుందని, క్రమశిక్షణతో చదువుల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడు తిరుపతి, సీనియర్ నాయకులు భిక్షపతి, కిషన్ గౌలీ, ప్రసాద్, సునీల్, సురేష్, ముర్గా, రాజు, శ్రీను, గోవింద, యాదయ్య, తదితర స్థానిక నేతలు పాల్గొన్నారు.