నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి టిమ్స్ హాస్పిటల్‌లో కోవిడ్ రోగులకు సరైన వైద్యం అందడం లేదని బిజెపి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి బయలుదేరిన బయలుదేరిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బిజెపి రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ.. టిమ్స్ ఆసుపత్రిలో కరోనా రోగులకు సకాలంలో ఆక్సిజన్, సరైన వైద్యం అందక విలవిల్లాడుతున్నారని, రోజుకు 20 నుంచి 30 మంది వరకు మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతో నిరసన చేపట్టేందుకు జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి పిలుపునిచ్చారని అన్నారు. ఈ క్రమంలోనే ముందస్తుగానే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి అనుమతి కోరినా పోలీసులు నిరాకరించారని, ప్రజాస్వామ్యంలో అన్యాయం జరిగితే నిరిసన తెలిపే హక్కు ఎవరైకైనా ఉంటుందని అన్నారు. మొన్న గాంధీ, నిన్న వరగంగల్ ఎంజీఎం హాస్పిటల్స్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్ టిమ్స్‌ను సైతం పరిశీలించాలని, ఇక్కడ కొరవడిన వైద్య సేవలను ఆయన దృష్టికి తీసుకువెళ్లాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. నిరసన తెలిపేందుకు బయలుదేరిన మమ్ములను ఇంటి వద్దే పోలీసులు అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కరానా కట్టడి, రోగులకు వైద్యం అందించే విషయంలో విఫలమైన టీఆర్ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.” ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.