కేసీఆర్ పథకాలతో జిల్లా సమగ్రాభివృద్ధి – ఆసిఫాబాద్ జిల్లా‌ కలెక్టరేట్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలలో భాగంగా 75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. పోలీస్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన విప్ గాంధీ స్వాతంత్ర్య వేడుకల్లో ప్రదర్శించిన పలు సాంస్కృతిక ప్రదర్శ‌నలను తిలకించారు.

ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టరేట్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ 75 వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతా జాతి, కుల, మత ప్రాంతాలకతీతంగా ఆనందోత్సాహాలతో పండుగలా జరుపుకునే ఏకైక పండగ జెండా పండగ అన్నారు. భారత జాతి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు పోరాడిన త్యాగధనులందరికీ జోహార్లు అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా సీఎం కేసీఆర్ సుపరిపాలన సాగిస్తున్నారని చెప్పారు.‌ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ప్రతి సంక్షేమ పథకం పేదవారికి చేరినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నారు. ప్రభుత్వ పథకాలను తీసుకువచ్చే ముందు పేద ప్రజలను గుర్తుకు తెచ్చుకోవాలని మహాత్మాగాంధీ చెప్పారన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

దళిత బంధు పథకం ద్వారా దళితుల సాధికారికత సుగుమమైందని, రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ వంటి పథకాల ద్వారా రైతుల జీవితాలలో వెలుగు నింపారన్నారు.‌ యువత మంచి స్ఫూర్తిదాయకమైన ఆలోచనలతో, గొప్ప లక్ష్యాలతో ముందుకువచ్చి దేశ, రాష్ట్ర, ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని యువతకు పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గాంధీ చెప్పారు. పరిపాలనను మరింత చేరువ చేసేందుకు చేపట్టిన జిల్లాల విభజనతో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల అమలులో ఆసిఫాబాద్ జిల్లా స్పూర్తి దాయకంగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవా లక్ష్మి, శాసన సభ్యులు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ , అడిషనల్ కలెక్టర్లు రాజేశం, ఛాథ్ బాజ్ పేయ్, జిల్లా ఎస్పీ సురేష్ కుమార్, అడిషనల్ ఎస్పీ అచ్చెశ్వర రావు, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, జిల్లా అధికార యంత్రాంగం, స్థానిక ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .

అసిఫా‌బాద్ జిల్లా లో జాతీయ జెండాకు గౌరవ వందనం చేస్తున్న విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here